Prayag Manjhi: ఝార్ఖండ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత హతం... తలపై రూ.1 కోటి రివార్డు

Jharkhand Encounter Top Maoist Leader Prayag Manjhi Killed
  • ఝార్ఖండ్ బొకారో జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్.
  • రూ. 1 కోటి రివార్డు ఉన్న కీలక నేత ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ హతం
  • 100కి పైగా హింసాత్మక ఘటనల్లో మాంఝీ ప్రమేయం
  • కేవలం గిరిధి జిల్లాలోనే ఇతనిపై 50కి పైగా కేసులు
ఝార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలతో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ. 1 కోటి రివార్డు ఉన్న కీలక నేత సహా 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. బొకారో జిల్లా పరిధిలోని లుగు పర్వత ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు, సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్, ఝార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా లుగు పర్వత ప్రాంతంలోని లాల్‌పానియా వద్ద కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. సోమవారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకరమైన కాల్పులు ప్రారంభమయ్యాయి. కొంతసేపటి తర్వాత మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా 8 మృతదేహాలు లభ్యమయ్యాయి.

మరణించిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, రూ. కోటి రివార్డు ఉన్న ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇతడిని ఫుచన, నాగ మాంఝీ, కరన్, లెతర అనే మారుపేర్లతో కూడా పిలుస్తారు. ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన సుమారు 100 హింసాత్మక ఘటనల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం గిరిధి జిల్లాలోనే ఇతనిపై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. 

ఇతని స్వస్థలం ధన్‌బాద్ జిల్లా తుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దల్‌బుద గ్రామం. ప్రశాంత్ హిల్స్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఇతడు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఝార్ఖండ్‌లో అత్యధిక రివార్డు ఉన్న రెండో మావోయిస్టు ప్రయాగ్ మాంఝీ కావడం గమనార్హం.

కాగా, ప్రయాగ్ మాంఝీ భార్య జయ మాంఝీని క్యాన్సర్ చికిత్స కోసం వచ్చినప్పుడు గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో మావోయిస్టుల ఏరివేత చర్యలు మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
Prayag Manjhi
Maoist leader killed
Jharkhand encounter
1 crore reward
Maoist
Naxal
Jharkhand Police
CRPF Cobra Battalion
Bokaro district
anti-naxal operation

More Telugu News