Madala Rangarao: మా నాన్నకి సొంత ఇల్లు ఉండేది కాదు: మాదాల రంగారావు తనయుడు రవి!

- డబ్బుపై నాన్నకి దృష్టి ఉండేది కాదు
- పార్టీ గురించి ఎక్కువ ఆలోచించేవారు
- దానధర్మాలు ఎక్కువ చేసేవారు
- ఆయనకి అడ్డుచెప్పలేదన్న మాదాల రవి
ఎర్ర సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాదాల రంగారావు. 1980లలో ఆయన నటించిన సినిమాలు .. ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. అలాంటి మాదాల రంగారావు గురించి, ఆయన తనయుడు రవి 'తెలుగు వన్'తో మాట్లాడుతూ, అనేక విషయాలను ప్రస్తావించాడు.
" మా నాన్నగారు సంపాదించింది ఏమీ లేదు. ఆయన నటించిన సినిమాల నుంచి వచ్చిన డబ్బులు, ఆ ఏరియాలకు సంబంధించిన పార్టీ ఆఫీసులకు ఇచ్చేసేవారు. తరువాత తీయనున్న సినిమా కోసం మాత్రమే ఆయన కొంత ఉంచేవారు. మిగిలిన డబ్బంతా పార్టీ ఆఫీసులకే వెళ్లిపోయేది. ఆయన సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఆయనకంటూ సొంత ఆస్తీ ఏమీ ఉండేది కాదు" అని చెప్పారు.
" ఫిల్మ్ నగర్లో నేను ఉంటున్న ఇల్లు మా ఫాదర్ నాకు ఇచ్చారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నేను సంపాదించుకుని కట్టుకున్న ఇల్లు అది. ఆయన స్కూటర్ పై తిరుగుతూ ఇబ్బంది పడుతున్నాడని నేను కారు కొని పెట్టాను. కారు ఇచ్చిన 5 నిమిషాలలో దానిని తీసుకుని వెళ్లి పార్టీ ఆఫీసులో పెట్టేసి వచ్చారు. ఇలాగే పొలాలు .. ఆస్తులు అన్నీ దానధర్మాలు చేస్తూ వెళ్లారు. మేము కూడా ఆయనకి ఎప్పుడూ అడ్డు చెప్పింది లేదు" అని అన్నారు.