Bala Aditya: విలేజ్ నేపథ్యంలో మెరిసే 'వెండిపట్టీలు'

- ఎమోషన్స్ ప్రధానంగా సాగే 'వెండిపట్టీలు'
- సతీష్ వేగేశ్న నుంచి మరో కొత్త కథ
- ఆకట్టుకునే పల్లె నేపథ్యం
- అదనపు బలంగా నిలిచే ఫొటోగ్రఫీ
ఈటీవీ విన్ అనుభూతి ప్రధానమైన కథలను 'కథాసుధ' అనే శీర్షిక క్రింద ప్రతి ఆదివారం ఒక కొత్త కథను స్ట్రీమింగ్ చేస్తూ వెళుతోంది. అలా నిన్న ఈటీవీ విన్ నుంచి వచ్చిన కథ .. 'వెండిపట్టీలు'. బాల ఆదిత్య .. లతా విశ్వనాథ్ రెడ్డి .. బేబీ జైత్ర వరేణ్య ప్రధానమైన పాత్రలను పోషించిన కథ ఇది. ఈ ఎపిసోడ్ కి రచయిత .. దర్శక నిర్మాత వేగేశ్న సతీష్ కావడం విశేషం.
వీరబాబు (బాల ఆదిత్య) సీత ( లతా విశ్వనాథ్ రెడ్డి) భార్యాభర్తలు. వారి సంతానమే దుర్గా ( బేబీ వరేణ్య). వీరబాబు దంపతులు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు. అందువలన మిగిలేదేమీ లేకపోయినా, శ్రమలోనే సంతోషాన్ని .. సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు. తనకి 'వెండిపట్టీలు' కావాలని 'దుర్గ' తరచూ మారాం చేస్తూ ఉండటం వలన, పంట డబ్బులు వచ్చాక కొనాలని అనుకుంటారు.
అయితే ఆ రాత్రే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? అది వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పుతుందనేది కథ. సున్నితమైన భావోద్వేగాలతో కూడుకున్న కథ ఇది. కథాకథనాల పరంగా చాలా సాధారణంగా అనిపించే ఈ కథకి, పల్లె వాతావరణం కొత్త అందాన్ని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. పల్లె వాసనను .. పల్లె మనసుల స్వచ్ఛతను ఆవిష్కరించే ఈ కథ నుంచి కొన్ని అనుభూతులను ఏరుకోవచ్చు.