Online Cricket Betting: క్రికెట్ బెట్టింగ్... వైసీపీ నేత తాతాజీపై కేసు నమోదు

- విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్
- పాలకొల్లు పట్టణ పోలీసుల అదుపులోకి ఇద్దరు నిందితులు
- ఇదే కేసులో యడ్ల తాతాజీ, నాగేశ్వరరావుపై కూడా కేసు నమోదు
విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వై మురళీ, ఎం. వెంకటరావులను పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత యడ్ల తాతాజీతో పాటు ఆయన సోదరుడు నాగేశ్వరరావుపై కూడా కేసు నమోదు కాగా... వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు వివరాలను నరసాపురం డీఎస్పీ శ్రీవేద మీడియా సమావేశంలో వెల్లడించారు. పాలకొల్లు పట్టణ పరిధిలోని పెనుమదం బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ భవనంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి నిర్వహించినట్లు తెలిపారు. అందులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
వారి వద్ద నుంచి రూ. 33వేల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యడ్ల తాతాజీ, ఆయన సోదరుడు నాగేశ్వరరావు గత పదేళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, ప్రస్తుతం రెండు పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయని డీఎస్పీ శ్రీవేద విలేకరులతో అన్నారు.