Champak: ఐపీఎల్ రోబోటిక్ డాగ్ పేరు ఏంటంటే..?

- ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా రోబో డాగ్
- ఇటీవల దీని పేరు కోసం పోల్ నిర్వహించిన నిర్వాహకులు
- పోల్‌లో మెజారిటీ ఆడియన్స్ ఓట్ల ఆధారంగా దీనికి 'చంపక్' అని నామకరణం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో రోబోటిక్ డాగ్‌కు పేరు పెట్టారు. ఇటీవల నిర్వహించిన పోల్‌లో మెజారిటీ ఆడియన్స్ ఓట్ల ఆధారంగా రోబో డాగ్‌కు చంపక్ అని పేరు పెట్టినట్లు ఐపీఎల్ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో తెలిపింది. మీట్ 'చంపక్' అని రాసుకొచ్చింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ముంబయి ఇండియన్స్ (ఎంఐ) మ్యాచ్ ప్రారంభానికి ముందు దీనికి ఈ పేరును పెట్టారు.
ఇక, ఈ సీజన్‌లో రోబోటిక్ డాగ్ బాగా సందడి చేస్తూ, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆటగాళ్ల వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేయడం మనం చూస్తున్నాం. అలాగే ప్లేయర్లు కూడా దీనితో సరదాగా ఆడుకుంటున్న వీడియోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి.
కాగా, ఈ రోబోటిక్ డాగ్ వేగంగా పరుగెత్తగలదు, నడవగలదు, జంప్ చేసేలా, కూర్చునేలా రూపకల్పన చేశారు. దీని తల ముందు భాగంలో కెమెరాను అమర్చారు. ఇది ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందివ్వగలదు. కొన్ని హవాభావాలను సైతం వ్యక్తపరుస్తుంది. దీంతో ఈ 18వ సీజన్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ఈ రోబో అంతర్భాగమైపోయింది. ఇది స్టేడియాల్లో సందడి చేస్తుంటే.. అందరూ ఉత్సాహంగా గమనిస్తున్నారు.