Kushboo Sundar: కుష్బూ ఎక్స్ అకౌంట్ ను హ్యాక్ చేశారు!

- కుష్బూ ఎక్స్ అకౌంట్ లో విదేశీ భాషలో ట్వీట్లు
- ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేసిన కుష్బూ
- 9 గంటలకు పైగా తాను ఎక్స్ లోకి లాగిన్ కాలేకపోతున్నానని వెల్లడి
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ తన సోషల్ మీడియా ఖాతా విషయంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) ఖాతా హ్యాకింగ్‌కు గురైందని, దానిని పునరుద్ధరించడంలో సహాయం చేయాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామం ఆమె అభిమానుల్లో, అనుచరుల్లో ఆందోళన రేకెత్తించింది. ప్రస్తుతం ఆమె ఎక్స్ ఖాతాలో విదేశీ భాషలో పలు ట్వీట్లు దర్శనమిస్తున్నాయి
కుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. "నా ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. దానిని ఎలా పునరుద్ధరించాలో ఎవరికైనా తెలిస్తే, దయచేసి చెప్పండి. ఇది చాలా అత్యవసరం" అని ఆమె తన పోస్టులో రాశారు. గత తొమ్మిది గంటలకు పైగా తాను తన ట్విట్టర్ ఖాతాలోకి లాగిన్ కాలేకపోతున్నానని ఆమె వివరించారు.
"నా ఐడీ, పాస్‌వర్డ్ పనిచేయడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్ అవ్వడం కుదరడం లేదు. నా ట్విట్టర్ పేజీలో ఎలాంటి పోస్టులు పెట్టలేకపోతున్నాను... అప్‌డేట్ చేయలేకపోతున్నాను" అని ఖుష్బూ పేర్కొన్నారు. ఖాతాను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, ఒకవేళ తన ఖాతా నుంచి ఏవైనా అసాధారణమైన పోస్టులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే తనకు తెలియజేయాలని ఆమె కోరారు. "అప్పటి వరకు, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉంటాను" అని ఆమె తెలిపారు.
ఖుష్బూ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్‌గా మారింది. అభిమానులు, అనుచరులు ఆమెకు మద్దతు తెలుపుతూ, ఖాతాను తిరిగి పొందేందుకు పలు సూచనలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.
కొన్ని వారాల క్రితమే మరో ప్రముఖ నటి త్రిష ట్విట్టర్ ఖాతా కూడా ఇలాగే హ్యాకింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె ఖాతా నుంచి క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ప్రచార పోస్టులు దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఖుష్బూ ఖాతా కూడా హ్యాకర్ల చేతికి చిక్కడంతో, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు, ఆమె ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి అనుమానాస్పద పోస్టుల పట్ల అయినా అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు, ఫాలోవర్లకు సూచించారు.

