Raj Kasi Reddy: ఇంతకీ రాజ్ కసిరెడ్డి ఎక్కడ...?

- ఏపీలో లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
- నేడు ఆడియో సందేశం వెలువరించిన రాజ్
- దాంతో అతడి ఆచూకీపై మరోసారి చర్చ
ఏపీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా ఆడియో సందేశం వెలువరించిన నేపథ్యంలో, ఆయన ఎక్కడున్నారన్న విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజ్ కసిరెడ్డి ఆచూకీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 23న ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, ఆయన నేపాల్ మీదుగా స్కాట్లాండ్ పారిపోయి, అక్కడి నుంచే న్యాయ పోరాటం చేస్తున్నారని, ఈ ఆడియో కూడా అక్కడి నుంచే పంపి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వాదనల పట్ల పోలీసు వర్గాల నుంచి ఎలాంటి స్పందన లేదు. కసిరెడ్డి దేశం విడిచి వెళ్లలేదని, డిజిటల్ ఆధారాలు లభించకుండా ఉండేందుకు నిరంతరం ప్రాంతాలు మారుస్తూ ఇక్కడే రహస్య ప్రదేశంలో తలదాచుకున్నారని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సిట్ దర్యాప్తు ముమ్మరం.. సోదాలు, పత్రాల స్వాధీనం
మరోవైపు సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లోని 15 ప్రాంతాల్లో ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు, ఆయన పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్న అరిటా హాస్పిటల్స్, ఈడీ క్రియేషన్స్ వంటి సంస్థలపై దాడులు నిర్వహించారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
విజయసాయి రెడ్డి ప్రస్తావించిన నలుగురు వ్యక్తులతో పాటు, ఆయా సంస్థల డైరెక్టర్లకు సోమవారం నుంచి నోటీసులు జారీ చేసి, పెట్టుబడుల మూలాలపై విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కసిరెడ్డి ఆడియో సందేశం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా సిట్ ఆరా తీస్తోంది.