Shine Tom Chacko: డ్రగ్స్ కేసు... ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్

- చాకోను అరెస్ట్ చేసిన కొచ్చి నగర పోలీసులు
- డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై నటుడి అరెస్ట్
- ఆయనపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని 27, 29 సెక్షన్ల కింద కేసు నమోదు
మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకోని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాల వినియోగం, కుట్ర కింద అతడిపై కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలు, మానసిక ప్రభావాలను కలిగించే పదార్థాలు (NDPS) చట్టంలోని 27, 29 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తదుపరి చట్టపరమైన చర్యలతో పాటు త్వరలో ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.
కేరళలోని ఎర్నాకుళం నార్త్ పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద నటుడి అరెస్టును అధికారికంగా నమోదు చేశారు. అయితే, చాకోపై మోపిన అభియోగాలు బెయిలబుల్ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొచ్చి నగర పోలీసులు సమన్లు జారీ చేసిన తర్వాత చాకో శనివారం ఉదయం డ్రగ్స్ రైడ్ విషయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ వారం ప్రారంభంలో జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (డాన్సాఫ్) నిర్వహించిన నార్కోటిక్స్ రైడ్ సందర్భంగా హోటల్ నుంచి పారిపోయాడని ఆరోపిస్తూ నటుడిని అధికారులు ప్రశ్నించారు.
బుధవారం రాత్రి పోలీసులు వచ్చారని గ్రహించిన చాకో తన హోటల్ గది మూడో అంతస్తు కిటికీ నుంచి రెండో అంతస్తు టెర్రస్ పైకి దూకినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి మెట్ల గుండా పారిపోయినట్లు సమాచారం. ఇక, విచారణ సమయంలో తలుపు వద్ద పోలీసు అధికారులు ఉన్నారని తాను గ్రహించలేదని, వారు తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దుండగులు అని భావించానని, దీంతో తాను తప్పించుకున్నానని చాకో చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయన కాల్ డేటా రికార్డులు, సందేశాల హిస్టరీని సేకరించినట్లు సమాచారం. ఎర్నాకులం సెంట్రల్ అసిస్టెంట్ కమిషనర్ సి జయకుమార్, నార్కోటిక్ సెల్ అసిస్టెంట్ కమిషనర్ కేఏ అబ్దుల్ సలాం నేతృత్వంలోని బృందం చాకోను విచారించింది.