Babesh Chandra Roy: బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్యపై తీవ్రంగా స్పందించిన భారత్

- దివాజ్‌పుర్‌కు చెందిన భబేష్ చంద్ర రాయ్ కిడ్నాప్, హత్య
- ఈ హత్య తమను ఎంతగానో కలిచివేసిందన్న భారత్
- మైనార్టీలను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉందన్న భారత్
బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు భబేష్ చంద్ర రాయ్ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భబేష్ చంద్ర రాయ్ కిడ్నాప్, హత్య తమ దృష్టికి వచ్చిందని, ఇది తమను ఎంతగానో కలిచివేసిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనార్టీలపై జరుగుతోన్న దాడుల్లో ఇది మరొక ఘటన అని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి దాడులకు పాల్పడినవారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివక్ష లేకుండా మైనార్టీలను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
భబేష్ చంద్ర రాయ్ ఉత్తర బంగ్లాదేశ్‌లోని దివాజ్‌పుర్‌కు చెందిన హిందూ మైనార్టీ నేత. గురువారం సాయంత్రం ఆయనకు ఫోన్ కాల్ రాగా, తాను ఇంట్లోనే ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, నరబరి గ్రామంలో తీవ్ర గాయాలతో కనిపించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించనట్లు వైద్యులు ధృవీకరించారు.