Raja Singh: మజ్లిస్ పార్టీని గెలిపిస్తే వారిని పాతరేస్తాం: రాజాసింగ్ హెచ్చరిక

- మజ్లిస్‌ను గెలిపించేందుకే బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంటోందని వ్యాఖ్య
- కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణ
- ఓటింగ్‌లో పాల్గొనకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లేనని వ్యాఖ్య
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకే బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంటోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. భాగ్యనగరంలో మజ్లిస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తామని అన్నారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని, విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కేటీఆర్ ప్రకటనపై రాజాసింగ్ స్పందించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించడంతో బీఆర్ఎస్ బండారం బట్టబయలు అయిందని రాజాసింగ్ అన్నారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారి రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లే అని రాజాసింగ్ అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేటర్లు అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.