Italy Prisons: ఇటలీ జైళ్లలో ‘లవ్ రూమ్’.. భాగస్వామితో ఖైదీలు ఏకాంతంగా గడిపే అవకాశం

- ప్రభుత్వ ఆదేశాలతో ఖైదీల ములాఖత్‌లో మార్పులు
- భార్య/భర్తతో ఏకాంతంగా గడిపేందుకు ఖైదీలకు అనుమతి
- ప్రతి ఆరు వారాలకు ఒక గంట పాటు ప్రత్యేక భేటీకి అవకాశం
- కుటుంబ హక్కుల పరిరక్షణ, ఖైదీల సంక్షేమం లక్ష్యంగా నిర్ణయం
ఖైదీల సంక్షేమం, కుటుంబ హక్కుల పరిరక్షణ దిశగా ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో ములాఖత్ సమయంలో ఏకాంతంగా గడిపేందుకు అనుమతిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది ఖైదీల మానసిక శ్రేయస్సును మెరుగుపరచడంతో పాటు, కుటుంబ బంధాలను కాపాడేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలో జైళ్లలో ఖైదీల ములాఖత్‌లు అధికారుల పర్యవేక్షణలో పరిమిత సమయం మాత్రమే జరిగేవి. దీనివల్ల ఖైదీలు తమ భాగస్వాములతో స్వేచ్ఛగా, ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. తాజా నిబంధనల ప్రకారం.. శిక్ష పడిన ఖైదీలకు నెలకు కనీసం నాలుగు సార్లు, ఒక్కోసారి 30 నిమిషాల పాటు సాధారణ ములాఖత్ కు అవకాశం కల్పించాలి. ప్రతి ఆరు వారాలకు ఒకసారి గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యే అవకాశం కూడా కల్పించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమయాన్ని మరింత పొడిగించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తారు. ఈ ములాఖత్ సమయంలో ఖైదీలకు తమ భాగస్వాములతో అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఏకాంతంగా గడిపే అవకాశం కలుగుతుంది.
ఖైదీల కుటుంబ హక్కులను గౌరవించడం, వారి పునరావాసానికి తోడ్పడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖైదీలు బయటి ప్రపంచంతో, ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల వారిలో మానసిక పరివర్తనకు, నేర ప్రవృత్తిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని మానవ హక్కుల సంఘాలు, సంస్కరణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇటలీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య, యూరోపియన్ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ విధానం వల్ల జైళ్లలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని, దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఇటలీ ప్రభుత్వం.. ములాఖత్‌ల సమయంలో దుర్వినియోగాన్ని నిరోధించడానికి, జైళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన నియంత్రణ, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఖైదీల పునరావాసం, సమాజంలో వారి పునరేకీకరణలో కుటుంబ సహకారం కీలక పాత్ర పోషిస్తుందనే విస్తృత అవగాహనకు ఈ నిర్ణయం అద్దం పడుతోంది.