Royal Challengers Bangalore: సొంతగడ్డపై బెంగళూరుకు హ్యాట్రిక్ ఓటమి

- వర్షం కారణంగా 14 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
- ఓడినా అర్థ సెంచరీ చేసిన టిమ్ డేవిడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
- రెండో స్థానంలోకి దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోమారు ఓడిన ఆర్సీబీ సొంతగడ్డపై హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ డేవిడ్ అర్ధ సెంచరీ (50), కెప్టెన్ రజత్ పటీదార్ 23 పరుగులు తప్ప జట్టులో ఒక్కరు కూడా డబుల్ డిజిట్‌ను చేరుకోలేకపోయారు. మిగతా 9 మంది కలిసి 21 పరుగులు చేశారంటే వారి బ్యాటింగ్ తీరు ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, మార్కో జాన్సెన్, చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 96 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఐదో విజయాన్ని నమోదు చేసింది. నేహాల్ వధేరా 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 13, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 7, జోష్ ఇంగ్లిష్ 14, మార్కస్ స్టోయినిస్ 7 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజెల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు.