Deepak: ఐసీయూలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

- ఆసుపత్రి ఐసీయూలో మహిళపై లైంగికదాడి
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి
- నిందితుడు ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్న దీపక్ (25)గా గుర్తించిన పోలీసులు
గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిళ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఈ నెల 6వ తేదీన ఓ యువకుడు చికిత్స పొందుతున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఐసీయూలో బెడ్‌పై చికిత్స పొందుతూ ఉండటం వల్ల ఆమె ఆ యువకుడిని ప్రతిఘటించలేకపోయింది.
ఈ నెల 13వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె తన భర్తకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి, ఆసుపత్రిలో జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. ఐసీయూలో ఉన్న సమయంలో తనపై లైంగికదాడి జరిగిందని, తన అనారోగ్యం కారణంగా ఆ యువకుడిని ఆ సమయంలో అడ్డుకోలేకపోయానని బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో ఇద్దరు నర్సులు కూడా అక్కడ ఉన్నారని, కానీ ఈ ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె పేర్కొంది.
దీంతో ఈ నెల 14న సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, ఎనిమిది మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. సిట్ బృందం నిందితుడిని గుర్తించేందుకు ఆసుపత్రిలోని దాదాపు 800 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది. అలాగే ఆసుపత్రి సిబ్బందిని విచారించింది.
ఈ క్రమంలో ఆసుపత్రిలో గత ఐదు నెలలుగా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన దీపక్ (25) సదరు మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు నిందితుడు దీపక్‌ను అరెస్టు చేశారు.