Revanth Reddy: రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న వార్నింగ్

- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇవ్వవద్దన్న తీన్మార్ మల్లన్న
- రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్లు ఇస్తే ముఖ్యమంత్రి కుర్చీని గుంజేస్తామని హెచ్చరిక
- వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం జపాన్ వెళ్లాలా అని నిలదీత
- రేవంత్ రెడ్డికి మోసం, కుట్ర, నయవంచన రంగాల్లో అనుభవం ఉందని వ్యాఖ్య
- చైనా వస్తువుకు ఎంత గ్యారెంటీ ఉంటుందో రేవంత్ రెడ్డి పాలనకు అంతే గ్యారంటీ అని ఎద్దేవా
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీని లాగేస్తామని శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని భావించామని, కానీ నోటిఫికేషన్ల ద్వారా బీసీలకు అన్యాయం చేస్తే ఆయన పదవీ కాలం ముగిసినట్లేనని అన్నారు.
బీసీ చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ, రూ. 8 లక్షల ఆదాయం ఉంటే పేదవాడు, రూ. 2 లక్షల ఆదాయం ఉంటే ధనవంతుడు అనే విధంగా చట్టాలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఏ రకమైన రిజర్వేషన్లు అని ప్రశ్నించారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను పూర్తిగా నిర్మూలించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈడబ్ల్యుఎస్ వ్యవస్థ మనుగడలో లేకుండా చూస్తామని అన్నారు.
పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి ఒక బృందంతో జపాన్‌కు వెళ్లారని గుర్తు చేశారు. జపాన్‌లో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారని విన్నామని, తెలంగాణలోని 2 కోట్ల మంది బీసీలు ఒక్కొక్కరు చాయ్ ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తే కోట్లాది రూపాయలు సమకూరేవని అన్నారు. పెట్టుబడుల కోసం అంత దూరం వెళ్లవలసిన అవసరం ఏముందని, బీసీలంతా కలిసి ఇచ్చేవారు కదా అని వ్యంగ్యంగా అన్నారు.
రేవంత్ రెడ్డికి పరిపాలనాపరమైన జ్ఞానం లేకపోయినప్పటికీ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున ఆయనకు గౌరవం ఇస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలనా రంగంలో అనుభవం లేదని, మోసం, కుట్ర, నయవంచన వంటి విషయాల్లో మంచి అనుభవం ఉందని విమర్శించారు. చైనా వస్తువులకు ఎంత గ్యారెంటీ ఉంటుందో, ఆయన పరిపాలనకు అంత గ్యారంటీ ఉంటుందని ఎద్దేవా చేశారు.