Raja Singh: కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టిన రాజాసింగ్!

- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
- హైదరాబాద్ లో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గైర్హాజరు
- కొంత కాలంగా కిషన్ రెడ్డికి, రాజాసింగ్ కు మధ్య విభేదాలు!
పరిస్థితులు చూస్తుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యే రాజాసింగ్ కు మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా బీజేపీలో అసంతృప్తి మరోసారి బయటపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారు. హైదరాబాద్ లో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఈ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజులుగా కిషన్ రెడ్డికి, రాజాసింగ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అన్ని కులాలు, వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ అని... కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా రాజకీయాలు చేస్తోందని రాజాసింగ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్న కిషన్ రెడ్డి కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా పార్టీలో సీనియర్లు పేరుకుపోయారని... వారిని వెంటనే పార్టీ నుంచి పంపిస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.