Prabodh Saxena: అధికారులకు హోలీ పార్టీ ఇచ్చి, బిల్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సీఎస్!

- హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రభోద్ సక్సేనా హోలీ పార్టీ బిల్లుపై వివాదం
- ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబాల విందుకు రూ.1.22 లక్షల ఖర్చు
- బిల్లును చెల్లింపు కోసం సాధారణ పరిపాలన విభాగానికి పంపిన వైనం!
- ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) ప్రభోద్ సక్సేనా తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆయన ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యుల కోసం హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు అయిన ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలని కోరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సక్సేనా మార్చి 31న సీఎస్ ఆ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆరు నెలల పొడిగింపు పొందిన సక్సేనా, మార్చి 14న సిమ్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని హోటల్ హాలిడే హోమ్‌లో ఈ విందు ఏర్పాటు చేశారు. దీనికి అయిన రూ.1.22 లక్షల బిల్లును చెల్లింపు కోసం సాధారణ పరిపాలన విభాగానికి పంపినట్లు సమాచారం.
ఈ బిల్లు వివరాలు చూస్తే, 77 మంది ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యుల భోజనానికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున, 22 మంది డ్రైవర్ల భోజనానికి ఒక్కొక్కరికి రూ.585 చొప్పున ఖర్చయింది. వీటితో పాటు ట్యాక్సీ ఛార్జీల కింద రూ.11,800, పన్నులు మరియు ఇతర ఛార్జీల కింద రూ.22,350 కలిపి మొత్తం రూ.1.22 లక్షల బిల్లును రూపొందించారు.
ఇది అధికారిక విందా లేక వ్యక్తిగత పార్టీనా అని సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి రాజేష్ శర్మను ప్రశ్నించగా, దీనికి చీఫ్ సెక్రటరీనే సరైన సమాధానం చెప్పగలరని ఆయన బదులిచ్చారు. మరి రూ.1.22 లక్షల బిల్లు ఎవరు చెల్లిస్తారని అడగ్గా, "తుది అధికారం ఆదేశాల మేరకే చెల్లింపులు జరుగుతాయి. మీరు చీఫ్ సెక్రటరీనే అడగాలి" అని ఆయన పేర్కొన్నారు.
ఇది స్పష్టమైన ఉల్లంఘన... విచారణకు బీజేపీ డిమాండ్
ప్రభుత్వ నిధులతో చీఫ్ సెక్రటరీ ప్రభోద్ సక్సేనా హోలీ పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బిక్రమ్ ఠాకూర్ గురువారం మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య విలువలు, నైతిక ప్రమాణాలు, పరిపాలనా మర్యాదలను స్పష్టంగా ఉల్లంఘించడమే అని అన్నారు.
రాష్ట్రం ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వం, బ్యూరోక్రసీ సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా విలాసాలకు పాల్పడటం దారుణమని విమర్శించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.