KTR: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో... లేకపోతే నాలుక కోస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

- చిల్లర రాజకీయాల కోసం కేటీఆర్ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్న ఐలయ్య
- ఎన్నిసార్లు హెచ్చరించినా కేటీఆర్ తీరు మారడం లేదని మండిపాటు
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తమ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలు, సోనియాగాంధీ ఇచ్చిన అభయ హస్తం, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే... కేటీఆర్ ఓర్చుకోలేక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాల కోసం సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకో బిడ్డా... లేకపోతే నాలుక కోస్తాం అని హెచ్చరించారు.
నోరు అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు హెచ్చరించినా నీ తీరు మారడం లేదని ఐలయ్య అన్నారు. పదేళ్ల పాటు తెలంగాణను పందికొక్కుల్లా దోచుకున్నారని... పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమకు చందాలు ఇస్తామంటున్నారంటూ కేటీఆర్ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదని అన్నారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చెప్పారు.