Ratan Tata: రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి: రఘురామకృష్ణరాజు

- గుంటూరులోని రియలెస్టేట్ వెంచర్ లో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన రఘురామ
- రతన్ టాటా గొప్ప మానవతావాది అని కొనియాడిన డిప్యూటీ స్పీకర్
- ఆయనకు భారతరత్న ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే మోదీకి లేఖ రాశానని వెల్లడి
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. గుంటూరులోని ఓ రియలెస్టేట్ సంస్థ నూతన వెంచర్ లో రతన్ టాటా విగ్రహాన్ని రఘురామ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని, గొప్ప మానవతావాది అని కొనియాడారు.
విద్య, వైద్య రంగాల్లో రతన్ టాటా ఎనలేని సేవలను అందించారని రఘురామ అన్నారు. దేశానికి, దేశ ప్రజలకు ఆయన అందించిన సేవలను ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని చెప్పారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని తాను నాలుగేళ్ల క్రితమే ప్రధాని మోదీకి లేఖ రాశానని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇచ్చినా, ఇవ్వకపోయినా... ప్రతి భారతీయుడి గుండెలో ఆయన రత్నమేనని అన్నారు. ఏ రియలెస్టేట్ వెంచర్ లోనైనా దేవుళ్ల విగ్రహాలు పెడతారని... ఇక్కడ మాత్రం రతన్ టాటా విగ్రహాన్ని పెట్టారని అభినందించారు.