Borugadda Anil Kumar: బోరుగడ్డ బెయిల్ పిటిషన్ విచారణను తోసిపుచ్చిన హైకోర్టు

- ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్
- తల్లికి అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్
- ఈ సందర్భంగా సమర్పించిన డాక్టర్ సర్టిఫికెట్ నకిలీదని తేలిన వైనం
- జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద వైద్యుడి వాంగ్మూలాన్ని నమోదు చేయించాలని ఆదేశం
గుంటూరుకు చెందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిలు వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని మెడికల్ సర్టిఫికెట్ చూపించి మధ్యంతర బెయిలు పొందాడు. అయితే, అది నకిలీ సర్టిఫికెట్ అని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సర్టిఫికెట్‌పై గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యుడు పీవీ రాఘవశర్మ సంతకం ఉండటంతో పోలీసులు ఆయనను విచారించారు. అయితే, ఆ సంతకం తనది కాదని, తాను ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
నకిలీ సర్టిఫికెట్ వ్యవహారంపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ రాఘవశర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో బోరుగడ్డ విభేదించాడు. ఈ నేపథ్యంలో జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద వైద్యుడి వాంగ్మూలాన్ని నమోదు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, బెయిలు పిటిషన్‌పై విచారణ జరపాలన్న బోరుగడ్డ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు తోసిపుచ్చారు.