Travis Head: ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత

- నిన్న వాంఖడేలో ఎంఐ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్
- ఐపీఎల్ లో అత్యంత వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా హెడ్
- 575 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించిన సన్‌రైజర్స్ ఓపెనర్
గురువారం వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 575 బంతుల్లో హెడ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఇక, ఈ జాబితాలో కరేబియన్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్ 545 బంతుల్లోనే ఈ ఫీట్‌ను నమోదు చేయడం విశేషం. వీరిద్దరి తర్వాత వరుసగా హెన్రిచ్ క్లాసెన్ (594), వీరేంద్ర సెహ్వాగ్ (604), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (610), యూసుఫ్ పఠాన్ (617), సునీల్ నరైన్ (617) ఉన్నారు.
కాగా, నిన్న ట్రావిస్ హెడ్ చాలా స్లోగా ఆడాడు. ఎప్పుడూ విధ్వంసం సృష్టించే ఈ ఆసీస్ ప్లేయర్ నిన్నటి తన 31 ఐపీఎల్ మ్యాచ్‌లలో అత్యంత నెమ్మదిగా ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటి. హెడ్ 29 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఎంఐ ఛేదించింది.