Tamil Nadu Government: 1,000 కిలోల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం... కారణం ఇదే!

Tamil Nadu Govt Melts 1000kg of Temple Gold Details Inside
  • 21 ఆలయాల్లో వాడకంలో లేని 1000 కిలోల బంగారం కరిగించిన వైనం
  • 24 క్యారెట్ల బంగారు కడ్డీలుగా మార్చి బ్యాంకుల్లో డిపాజిట్
  • ఏటా రూ. 17.81 కోట్ల వడ్డీ... ఆలయాల అభివృద్ధికి వినియోగం
  • విశ్రాంత న్యాయమూర్తుల కమిటీల ద్వారా పథకం పర్యవేక్షణ.
రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు సమర్పించిన, ఉపయోగంలో లేని బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటూ వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రముఖ దేవాలయాలలో నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారాన్ని కరిగించి, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు కడ్డీలుగా మార్చి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ఈ బంగారం డిపాజిట్ పథకం ద్వారా ఏటా రూ. 17.81 కోట్ల వడ్డీ లభిస్తున్నట్లు గురువారం నాడు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు శాసనసభలో ప్రవేశపెట్టిన విధాన పత్రంలో ఈ వివరాలను వెల్లడించారు. భక్తులు కానుకగా సమర్పించిన, దేవతామూర్తులకు అలంకరణకు గానీ, ఇతర అవసరాలకు గానీ వాడకుండా ఉన్న బంగారు వస్తువులను ముంబైలోని ప్రభుత్వ మింట్‌లో కరిగించి, స్వచ్ఛమైన బంగారు కడ్డీలుగా మార్చినట్లు తెలిపారు. అనంతరం ఈ కడ్డీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 'బంగారు పెట్టుబడి పథకం' కింద డిపాజిట్ చేసినట్లు వివరించారు. "ఈ పెట్టుబడుల ద్వారా సమకూరే వడ్డీని పూర్తిగా సంబంధిత ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగిస్తున్నాం" అని మంత్రి తన నివేదికలో పేర్కొన్నారు.

ఈ పథకం అమలును పారదర్శకంగా పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున, మొత్తం మూడు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. విశ్రాంత న్యాయమూర్తులు ఈ కమిటీలకు నేతృత్వం వహిస్తున్నారు. 

2025 మార్చి 31 నాటికి గల గణాంకాల ప్రకారం... 21 ఆలయాల నుంచి సేకరించిన సుమారు 1,074 కిలోల స్వచ్ఛమైన బంగారం ద్వారా... పెట్టుబడి సమయంలో ఉన్న బంగారం విలువ ప్రకారం ఏటా రూ. 17.81 కోట్లు (రూ. 1,781.25 లక్షలు) వడ్డీగా లభిస్తోందని విధాన పత్రం స్పష్టం చేసింది. ఈ పథకానికి అత్యధికంగా తిరుచిరాపల్లి జిల్లాలోని సమయపురం అరుళ్‌మిగు మరియమ్మన్ ఆలయం నుంచి సుమారు 424 కిలోల బంగారం సమకూరినట్లు తెలిపారు.

బంగారంతో పాటు, దేవాలయాల్లో వాడకంలో లేని, వినియోగానికి పనికిరాని వెండి వస్తువులను కూడా కరిగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఆమోదం పొందిన, వెండి కరిగించే ప్రైవేట్ సంస్థల ద్వారా, న్యాయమూర్తుల నేతృత్వంలోని జోనల్ కమిటీల సమక్షంలో, ఆలయ ప్రాంగణాల్లోనే ఈ వెండిని కరిగించి శుద్ధమైన వెండి కడ్డీలుగా మార్చనున్నారు. "ఇందుకు సంబంధించిన చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి" అని నివేదికలో పేర్కొన్నారు. 
Tamil Nadu Government
Temple Gold
Gold Deposit Scheme
PK Sekhar Babu
SBI Gold Investment Scheme
India Gold
Temple Gold Melting
Tiruchirapalli
Samayapuram Arulmigu Mariamman Temple

More Telugu News