Roja: నీకు, నీ అన్నకు పదవులు ఇస్తే చాలా... ఇక మాట్లాడరా?: పవన్ పై రోజా ఫైర్

- తిరుమలలో జరుగుతున్న అపచారాలపై పవన్ మాట్లాడటం లేదన్న రోజా
- గోవుల మరణాలను బయటపెట్టిన భూమనపై కేసులు పెట్టాలనడం సరికాదని వ్యాఖ్య
- గోవులు చనిపోతుంటే పవన్ స్పందించడం లేదని మండిపాటు
- ప్రభుత్వ తప్పుల్లో పవన్ భాగస్వామ్యం ఉందన్న రోజా
- గోశాల పరిస్థితి ప్రజలందరికీ తెలియాలని వ్యాఖ్య
మీకు, మీ అన్నకు పదవులు, ప్యాకేజీలు ఇస్తే చాలా? మీ నోరు పెగలదా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు... ఈరోజు తిరుమలలో ఎన్నో అపరాచాలు, ఘోరాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సనాతన ధర్మంలో గోమాతలను పూజిస్తారని... ఈరోజు గోశాలలో గోవులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని రోజా అన్నారు. దేవుడితో ఎవరూ పెట్టుకోవద్దని చెప్పారు. తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసినా ఎంత పెద్దవారైనా కేసులు పెట్టాలని... కానీ, గోశాలలో జరిగిన విషయాన్ని బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెట్టాలని అనడం సరికాదని అన్నారు. గోశాల పరిస్థితికి కారణమైన వారిపై కేసులు పెట్టి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్లో పవన్ కల్యాణ్ కు కూడా భాగస్వామ్యం ఉందని రోజా అన్నారు. పవన్ ఏడు కొండల మెట్లను కడగాలని చెప్పారు.
టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మరణించాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోశాల వద్దకు రావాలంటూ కూటమి నేతలు సవాల్ విసిరారు. కేవలం గన్ మన్లతోనే గోశాలకు వెళ్లాలని, అనుచరులతో కలిసి వెళ్లవద్దని భూమనకు పోలీసులు షరతు విధించారు. కానీ, పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి గోశాలకు వెళ్లేందుకు భూమన ఇంటి నుంచి బయటకు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూమన, వైసీపీ ఎంపీ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా రోజా అక్కడకు వెళ్లి నిరసనలో పాల్గొన్నారు.
దీనిపై రోజా మాట్లాడుతూ... మీరు చెప్పినట్టుగా గోశాలకు భూమన ఒక్కరినే రమ్మంటే వస్తారని... లేదా మమ్మల్ని అందరినీ రమ్మంటే వస్తామని అన్నారు. గోశాలలోని పరిస్థితి ప్రజలకు తెలవాలని చెప్పారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసని... చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసని, పవన్ కల్యాణ్ కు ఈ మధ్యనే కొంచెం అర్థమయిందని అన్నారు.