Lakshmi: రామారావుగారు నాతో చెప్పిన మాట అదొక్కటే: నటి లక్ష్మి

- రామారావుగారు ఎంతో గౌరవిస్తారన్న లక్ష్మి
- ఆరోగ్యం విషయంలో సలహాలు ఇస్తారని వ్యాఖ్య
- ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటారన్న నటి
- ఆయన ఇచ్చిన స్ఫూర్తినే తాను ఎదగడానికి కారణమన్న లక్ష్మి
లక్ష్మి .. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నటి. వివిధ భాషల్లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఆమె, తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు వంటి కథానాయకులతో కలిసి నటించారు. ఆమె వాయిస్ .. డైలాగ్ డెలివరీ ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. అలాంటి లక్ష్మి తాజాగా ' అన్న ఎన్టీఆర్' యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రామారావుతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు.
"ఎన్టీ రామారావుగారి పౌరాణిక సినిమాలను చూస్తూ పెరిగిన నాకు, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. ఆయనతో నా ఫస్టు సినిమా చేసే సమయానికి నా వయసు చాలా చిన్నది. అయినా ఆయన నాకు ఇచ్చే గౌరవం చూసి ఆశ్చర్యపోయాను. అందరినీ సమానంగా చూసే ఆయన స్వభావం నన్ను ఆలోచింపజేసింది. సెట్లో ప్రతి విషయంపై ఆయన పూర్తి ఫోకస్ పెట్టేవారు. ఏ విషయాన్ని సరదాగా .. నవ్వులాటగా తీసుకునేవారు కాదు. బాగా తినాలి .. ఉదయం 4 గంటలకే లేవాలి .. వ్యాయామం చేయాలి అని చెప్పేవారు" అని అన్నారు.
"ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ .. 'ఒక కాలుపోయినా ఇంకొక కాలు ఉందిగదా అనుకోవాలి లక్ష్మిగారూ. ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి .. కొల్పోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడే కుప్పకూలిపోతాం. కాలం మన చేతిలో ఉంది .. అది మన చేతిలో ఉన్నంతవరకూ మనం ఏమీ కోల్పోనట్టే" అన్నారు. ఆ ఒక్క మాట నన్ను ఇంతవరకూ నడిపించింది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రామారావుగారితో నటించడమే నేను చేసుకున్న అదృష్టం" అని ఆమె చెప్పారు.