Donald Trump: ట్రంప్ టారిఫ్‌లపై కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం: కోర్టులో దావాకు సిద్ధం

California Sues Trump Over Tariffs

 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను (టారిఫ్‌లు) సవాలు చేస్తూ కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో దావా వేయనుంది. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, వాటిని విధించే అధికారం అధ్యక్షుడికి లేదని ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా, ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది.

ఈ టారిఫ్‌ల వల్ల కాలిఫోర్నియాలోని కుటుంబాలు, వ్యాపారాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయని గవర్నర్ న్యూసమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ధరలు పెరిగిపోతున్నాయని, ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "అమెరికన్ కుటుంబాల ప్రయోజనాల కోసం మేము నిలబడుతున్నాం. ఈ గందరగోళం కొనసాగడానికి వీల్లేదు" అని ఆయన పేర్కొన్నారు. ఈ విధ్వంసకర, గందరగోళ టారిఫ్‌లను విధించే అధికారం డొనాల్డ్ ట్రంప్‌కు లేదని, దీనివల్ల అమెరికా చాలా నష్టపోతుందని సామాజిక మాధ్యమం ఎక్స్  ద్వారా తెలిపారు. అందుకే తాము ఆయనను కోర్టుకు లాగుతున్నామని స్పష్టం చేశారు.

అధ్యక్షుడు ట్రంప్ 'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం'  కింద ఈ టారిఫ్‌లను విధించారు. అయితే, ఏకపక్షంగా ఇలాంటి సుంకాలను విధించే అధికారాన్ని ఆ చట్టం అధ్యక్షుడికి ఇవ్వలేదని కాలిఫోర్నియా అధికారులు తమ దావాలో వాదించనున్నారు. ఈ మేరకు ఉత్తర కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో త్వరలో దావా దాఖలు చేయనున్నట్లు సమాచారం.

దేశంలోకి వచ్చే సరుకు రవాణాలో 40 శాతం కాలిఫోర్నియాలోని రెండు ప్రధాన ఓడరేవుల ద్వారానే జరుగుతుందని, ఇందులో చైనా నుంచే దాదాపు 50 శాతం ఉంటుందని గవర్నర్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఈ టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. 675 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంతో, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలకు కాలిఫోర్నియా కేంద్రంగా ఉంది. 

Donald Trump
California
Tariffs
Trade War
Gwin Newsom
International Trade
Legal Battle
US District Court
Economic Impact
China
  • Loading...

More Telugu News