AP Secretariat Towers: ఏపీ రాష్ట్ర సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు

- ఐదు టవర్ల నిర్మాణానికి రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం
- సచివాలయానికి సంబంధించి నాలుగు టవర్లు, హెచ్‌వోడీలకు సంబంధించిన ఒక టవర్ నిర్మాణం
- టవర్ల నిర్మాణం పూర్తి చేసేందుకు రెండున్నర సంవత్సరాలు గడువుగా పేర్కొన్న సీఆర్డీఏ
రాజధాని అమరావతిలో కీలకమైన సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. సచివాలయం కోసం నాలుగు టవర్లు, హెచ్‌వోడీల కార్యాలయాల కోసం ఒక టవర్ నిర్మాణానికి సీఆర్డీఏ బుధవారం టెండర్లు పిలిచింది.
సచివాలయం టవర్లు 1, 2 కోసం రూ.1,897 కోట్లు, టవర్లు 3, 4 కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేసింది. హెచ్‌వోడీల కార్యాలయం కోసం రూ.1,126 కోట్లతో ఒక టవర్ నిర్మాణం కోసం మరో టెండర్‌ను పిలిచింది. మొత్తంగా ఐదు టవర్ల నిర్మాణాన్ని రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మే 1న సచివాలయ, హెచ్‌వోడీ టవర్లకు సంబంధించి సాంకేతిక బిడ్లను సీఆర్డీఏ తెరవనుంది. హెచ్‌వోడీలకు సంబంధించి 45 అంతస్తులతో ఒక టవర్, మిగతా నాలుగు టవర్లు 40 అంతస్తులతో నిర్మాణం జరగనుంది. ఈ సచివాలయ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రెండున్నర సంవత్సరాల గడువును సీఆర్డీఏ నిర్ణయించింది.