Varalaxmi Sarathkumar: ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్!

- తమిళంలో రూపొందిన 'శివంగి'
- మార్చి 7న విడుదలైన సినిమా
- మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 18 నుంచి ఆహా తమిళ్ లో
వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో .. తెలుగు హీరోయిన్ ఆనందికి తమిళంలో అంతే క్రేజ్ ఉంది. రెబల్ పాత్రలు చేయడంలో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎంతటి పేరు ఉందో .. సాఫ్ట్ రోల్స్ చేయడంలో ఆనందికి అంతే పేరు ఉంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమానే 'శివంగి'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించారు.
తమిళంలో రూపొందిన ఈ సినిమాను మార్చి 7వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదల చేశారు. మర్డర్ కేసు చుట్టూ తిరిగే కథ ఇది. జాన్ విజయ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా తమిళ్' ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
సత్యభామ (ఆనంది) ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె అందమే ఆమెకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఆఫీసులో ఆమెకి వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో వాటిని ఫేస్ చేస్తూ వస్తున్న ఆమె, ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆ మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ (వరలక్ష్మి శరత్ కుమార్) రంగంలోకి దిగుతుంది. ఆ హత్య ఎవరు చేశారు? ఈ కేసు విషయంలో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ.