Maoist leaders killed: చత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల మృతి

- ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి
- ఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
- అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కొండగావ్ – నారాయణ్‌పూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఆ తర్వాత అక్కడ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన వారిని మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ తెలిపారు.