Rupa Kudavayur: ఓటీటీకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ 'యమకాతగి'

- తమిళంలో రూపొందిన 'యమకాతగి'
- మార్చి 7న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఆత్మహత్య చుట్టూ అల్లుకున్న కథ
- 'ఆహా తమిళ్'లో మొదలైన స్ట్రీమింగ్
తమిళంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఆ సినిమా పేరే 'యమకాతగి'. జయశీలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. రూప కడువాయుర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. నరేంద్ర .. గీత కైలాసం .. రాజు రాజప్పన్ .. హరిత .. ప్రదీప్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
రూప విషయానికి వస్తే తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిందిగానీ, అవి ఆడియన్స్ కి రీచ్ కాకపోవడం వలన, ఆమెను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో మాత్రం ఇదే ఆమె ఫస్టు మూవీ. నటన పరంగా ఈ సినిమా ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టింది. శ్రీనివాసరావు .. గణపతి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి, జెసిన్ జార్జ్ సంగీతాన్ని సమకూర్చాడు.
అది ఒక మారుమూల గ్రామం. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి 'లీల' నివసిస్తూ ఉంటుంది. ఒక రోజున కుటుంబ సభ్యులు చూసేసరికి లీల 'ఉరి'కి వ్రేళ్లాడుతూ కనిపిస్తుంది. అంత్యక్రియలకు అంతా సిద్ధం చేసి .. శవాన్ని తీసుకువెళ్లడానికి అంతా రెడీ అవుతారు. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ శవాన్ని బయటకి తీసుకుని వెళ్లడానికి వీలు పడదు. అందుకు కారణం ఏమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.