Padi Kaushik Reddy: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగింది: పాడి కౌశిక్ రెడ్డి

Group 1 Exam Scam Allegations by Padi Kaushik Reddy

  • కోఠి కళాశాలలో పరీక్ష రాసిన వారిలో 74 మంది ఎంపికయ్యారన్న ఎమ్మెల్యే
  • 25 సెంటర్లలో 10 వేల మంది రాస్తే 69 మంది మాత్రమే ఎంపికయ్యారన్న కౌశిక్ రెడ్డి
  • గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది ఎంపికయ్యారని... అదేవిధంగా 25 సెంటర్లలో 10 వేల మంది పరీక్ష రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 654 మందికి ఒకే విధమైన మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టిక్కెట్లు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. ఒక కాంగ్రెస్ నాయకుడి కోడలికి ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు వచ్చిందని, ఆమె కోఠి కళాశాలలోనే పరీక్ష రాశారని గుర్తు చేశారు.

ఉర్దూలో పరీక్ష రాసిన 9 మందిలో ఏడుగురు ఎంపికయ్యారని, టాప్ 100లో ఉర్దూ మీడియం అభ్యర్థులు ముగ్గురు ఉన్నారని వెల్లడించారు. అయితే, 8 వేల మంది తెలుగులో పరీక్ష రాస్తే కేవలం 60 మంది మాత్రమే ఎంపికయ్యారని, టాప్ 100లో నలుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. గ్రూప్-1 అంశంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకైతే పరీక్షను రద్దు చేశామని, కాంగ్రెస్ నాయకులు ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు.

Padi Kaushik Reddy
Group-1 Exam Scam
TSPSC
Telangana PSC
Exam irregularities
CBI investigation
Congress leader
Urdu medium
Telugu medium
Hall tickets
  • Loading...

More Telugu News