Chandrababu Naidu: ఆ ఒక్కసారి నేను మోసపోయాను... నేను కరెక్ట్ గా అనలైజ్ చేసుంటే మరోలా ఉండేది: సీఎం చంద్రబాబు

- ఇవాళ అంబేద్కర్ జయంతి
- గుంటూరు జిల్లా పొన్నెకల్లులో కార్యక్రమం
- హాజరైన సీఎం చంద్రబాబు
- నాడు గొడ్డలిపోటును గుండెపోటు అని నమ్మానని వెల్లడి
- ఆ చిన్న తప్పుకు రాష్ట్రం భారీ మూల్యం చెల్లించిందని ఆవేదన
ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. గోశాలలో గోవులు చనిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
"గోశాలలో పశువులు చనిపోయాయంట... ఆయన (భూమన) బాధపడుతున్నాడంట! దేవుళ్లపై దాడులు చేసిన మీకు (వైసీపీ నేతలు)... ఈ రోజున వెంకటేశ్వరస్వామిపై ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కావడంలేదు. మీరు ఏనాడూ వెంకటేశ్వరస్వామికి సంప్రదాయాలు పాటించిన వాళ్లు కాదు. వెంకటేశ్వరస్వామి మా ఇంటి ఇలవేల్పు. ఆయనకు అపవిత్రత కలిగించే చర్యలకు పాల్పడినప్పుడు బాధ కలుగుతుంది. అలాంటి మీరు... ఇవాళేదో జరగరానిది జరిగిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి కపట నాటకాలు ఇకనైనా కట్టిపెట్టండి.
ఒకసారి నేను కూడా మోసపోయాను. గొడ్డలి పోటును గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి... నేను గనుక అనలైజ్ చేసి కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆ రోజే దోషులను అరెస్ట్ చేసుంటే ఏమై ఉండేదో! ఆ ఒక్క చిన్న తప్పుకు రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అవతలి వారు చేసే కుట్రలను ప్రజాచైతన్యం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మళ్లీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది" అని చంద్రబాబు వివరించారు.