ICC: క్రికెట్‌లో కీలక మార్పుల దిశగా ఐసీసీ

ICC Plans Key Changes to Cricket

  • పురుషుల అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రవేశపెట్టే యోచన
  • టెస్టుల్లోనూ టైమర్ ప్రవేశపెట్టాలని నిర్ణయం
  • వన్డేల్లో రెండు బంతుల విధానానికి చెక్
  • త్వరలో ప్రకటించనున్న ఐసీసీ

కాలానుగుణంగా క్రికెట్‌లో మార్పులకు శ్రీకారం చుడుతున్న ఐసీసీ.. వన్డే, టీ20తోపాటు టెస్ట్ ఫార్మాట్‌లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న భేటీలో జైషా నేతృత్వంలోని ఐసీసీ ఈ మార్పులపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వన్డేల్లో రెండు బంతుల నియమాన్ని రద్దు చేయడం, టీ20ల్లోనూ అండర్-19 ప్రపంచకప్ ప్రవేశపెట్టడం, టెస్టుల్లో ఓవర్ రేటును లెక్కించేందుకు టైమర్‌ను ప్రవేశపెట్టడం వంటి మార్పులు చేయాలని ఐసీసీ యోచిస్తోంది. ఏప్రిల్ 10న ప్రారంభమైన ఈ భేటీ రేపటి (13వ తేదీ) వరకు కొనసాగనుంది. అనంతరం ఈ మూడు అంశాలపై ఐసీసీ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

వన్డేల్లో ప్రస్తుతం రెండు బంతుల విధానం కొనసాగుతోంది. బౌలింగ్ కోసం ప్రతి జట్టు కొత్త బంతిని ఉపయోగిస్తుంది. కొత్త బంతి మెరుస్తుండటం వల్ల పేసర్లు స్వింగ్‌ను రాబట్టలేకపోతున్నారు. అలాగే, 25 ఓవర్ల తర్వాత మళ్లీ కొత్త బంతిని తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా బ్యాటర్లు అదనపు లబ్ధి పొందుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బౌలర్లకు కూడా అనుకూలంగా ఉండేలా ఈ రెండు బంతుల నిబంధనను రద్దు చేయాలని ఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.

టెస్టుల్లోనూ టైమర్‌ను ప్రవేశపెట్టాలన్నది ఐసీసీ యోచన. స్లో ఓవర్ రేటు కారణంగా ఐపీఎల్‌లో పలువురు కెప్టెన్లు భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల బీసీసీఐకి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. ఇకపై ఇదే పద్ధతిని టెస్టుల్లోనూ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఓవర్ పూర్తయిన నిమిషంలోనే మరో ఓవర్ తొలి బంతి పడాల్సి ఉంటుంది. టెస్టుల్లో ఒక రోజు 90 ఓవర్లు వేయాలి. దీనిని పక్కాగా అమలు చేసేందుకు టైమర్ నిర్ణయమే సరైనదన్న అభిప్రాయం ఉంది.

ఇక మూడోది అండర్-19 టీ20 ప్రపంచకప్. ప్రస్తుతం టీ20లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వన్డేల్లానే అండర్-19 ప్రపంచకప్ ప్రవేశపెట్టాలని ఐసీసీ యోచిస్తోంది. ఇప్పటి వరకు రెండుసార్లు అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ జరిగింది. ఈ నేపథ్యంలో పురుషుల విభాగంలోనూ అండర్-19 ప్రపంచకప్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తోంది.

ICC
Cricket
ODI Cricket
T20 Cricket
Test Cricket
Cricket Rules Changes
Two New Balls Rule
Under-19 T20 World Cup
Over Rate Timer
Cricket World Cup
  • Loading...

More Telugu News