Delhi: ఢిల్లీలో గాలి దుమారం... 15 విమానాల దారి మళ్లింపు

- విమాన రాకపోకలపై ప్రతికూల ప్రభావం
- ఆలస్యంగా నడుస్తున్న విమానాలు
- విరిగిపడిన చెట్లు
- హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేడితో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈరోజు సాయంత్రం ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో బలమైన గాలులతో కూడిన దుమ్ము తుపాను సంభవించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
ఈదురు గాలుల కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే 15 విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భారీ ఉరుములు, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు. ఇండిగో మరియు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు కూడా వాతావరణం కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి.
దుమ్ము తుపాను కారణంగా పంటలకు, బలహీనమైన నిర్మాణాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ప్రయాణాలు చేయకుండా ఉండాలని సూచించింది. చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, కాంక్రీట్ నేలపై పడుకోవద్దని, కాంక్రీట్ గోడలకు ఆనుకోవద్దని సూచించారు. విద్యుత్ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలని, నీటి వనరుల నుంచి వెంటనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు.
దుమ్ము, శిథిలాలు గాలికి ఎగిరిపడుతూ వాహనాలపై భవనాలపై కమ్ముకున్నాయి. గురుగ్రామ్‌లో తీవ్రమైన గాలి దుమారం సంభవించింది. ఢిల్లీలోని లోధి గార్డెన్‌తో సహా అనేక ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఢిల్లీ గేట్ ప్రాంతంలో ఒక చెట్టు ఆగి ఉన్న మోటార్‌సైకిల్‌పై పడింది.
ఇవాళ ఢిల్లీలో తేలికపాటి జల్లులు కురిశాయి, దీని కారణంగా వాతావరణం చల్లబడింది. సోమవారం నాడు హస్తినలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఈ సీజన్‌లో మొదటిసారిగా 40 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది.
అటు, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు కూడా గాలి దుమారం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే మైదానం వీడి డగౌట్ వద్దకు పరుగులు తీశారు.