Vaishnavi Chaitanya: వైష్ణవీ .. ఇలాగైతే ఎలాగంటున్న ఫ్యాన్స్!

- 'బేబి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి
- ఫస్టు మూవీతోనే దక్కిన భారీ హిట్
- యూత్ లో పెరిగిన విపరీతమైన క్రేజ్
- తగ్గుతున్న సక్సెస్ గ్రాఫ్
ఈ మధ్య కాలంలో కుర్రాళ్లను ఎక్కువగా ప్రభావితం చేసిన పేరు వైష్ణవీ చైతన్య. 'బేబి' సినిమాతో ఈ బ్యూటీ యూత్ ను ఒక్కసారిగా తనవైపుకు తిప్పేసుకుంది. ఆ సినిమాలో ఆమె చాలా గ్లామరస్ గా మెరిసింది. తెలుగు నుంచి వచ్చిన హీరోయిన్ గా కూడా ఆమె మరికొన్ని మార్కులను కొట్టేసింది. ఇతర భాషల నుంచి వచ్చి ఇక్కడ దూసుకుపోతున్న బ్యూటీలకు వైష్ణవీ చైతన్య కంగారు పుట్టించిందని చెప్పుకున్నారు. కొంతకాలం పాటు ఆమె హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలోనే వైష్ణవీ 'లవ్ మీ' అనే సినిమా చేసింది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవీ చైతన్య కోసమే ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్లారు. అయితే వాళ్లు ఆశించిన స్థాయిలో ఆమె పాత్ర ఆకట్టుకోలేకపోయింది. ఆమె పాత్రలో విషయం లేకపోవడం వాళ్లను చాలా నిరాశ పరిచింది. పాత్రల ఎంపికలో వైష్ణవి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలనే కామెంట్స్ వినిపించాయి. ఈ రోజున విడుదలైన 'జాక్' సినిమా విషయంలోనే ఆమెకి అవే కామెంట్స్ ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎంతమాత్రం ప్రాధాన్యత లేదనీ, అలాంటి పాత్రను ఆమె చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం .. ఫస్టు సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. అయితే అసలైన పరీక్ష, వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడమేనని చెప్పాలి. అలా జరగాలంటే కథల ఎంపిక .. పాత్రల ఎంపిక విషయంలో గట్టి కసరత్తు జరగాలి. ఈ విషయంలోనే వైష్ణవీ మొహమాటానికి పోతున్నట్టుందనేది ఫ్యాన్స్ టాక్. ఇకనైనా ఆమె కేర్ఫుల్ గా ఉండాలని సలహా ఇస్తున్నారు.