Ghantasala: ఇన్ని కష్టాలు పడతానని అనుకోలేదు: 'ఘంటసాల' సినిమా దర్శకుడు!

- ఘంటసాల గారి అభిమానినన్న దర్శకుడు
- 2 కోట్లతో ఈ సినిమాను నిర్మించానని వెల్లడి
- ఘంటసాలగారి అబ్బాయి సపోర్టు చేయలేదు
- అందువల్లనే రిలీజ్ ఆలస్యమైందన్న దర్శకుడు
ఘంటసాల స్వరం ఓ తేనె జలపాతం .. ఆయన గానం ఓ అమృత ప్రవాహం. అలాంటి ఘంటసాలను అభిమానించనివారంటూ ఉండరు. అలాంటి ఆయన అభిమానులలో సీహెచ్ రామారావు గారు ఒకరు. పోలీస్ డిపార్టుమెంటులో పనిచేసిన ఆయన, ఘంటసాల పట్ల గల అభిమానంతో 'ఘంటసాల ది గ్రేట్' అనే ఒక సినిమాను తెరకెక్కించారు. ఎన్నో అవాంతరాలను దాటుకుని ఆ సినిమాను దశలవారీగా విడుదల చేస్తూ వెళుతున్నారు.
తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామారావు మాట్లాడుతూ .. "నేను ఘంటసాలగారి అభిమానిని. ఆయన పాటలంటే నాకు ప్రాణం. ఆయన సినిమా తీయడానికి ముందు వారి అబ్బాయి రత్నకుమార్ గారిని కలిశాను .. ఘంటసాలగారి సతీమణి సావిత్రి గారి అనుమతి కూడా లిఖిత పూర్వకంగా తీసుకున్నాను. తీరా సినిమాను పూర్తి చేసి .. టీజర్ ను వదిలిన సమయంలో, రిలీజ్ ను ఆపాలంటూ రత్నకుమార్ గారు కోర్టుకు వెళ్లారు. అందువలన సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది" అని అన్నారు.
" ఘంటసాల గారి పాట కంటే కూడా ఆయన వ్యక్తిత్వం గొప్పది. ఆ విషయాన్ని తరువాత తరాల వారికి తెలియాలనే నేను ఈ సినిమాను తీశాను. నేను .. నా స్నేహితులు కలిసి దాదాపు 2 కోట్లు పెట్టాము. కానీ రత్నకుమార్ గారి నుంచి క్లారిటీ లేకపోవడం వలన ఇబ్బందిపడ్డాము. ఆయన చనిపోయిన తరువాత కుటుంబ సభ్యులు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు .. అనుమతిని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను దశలవారీగా విడుదల చేస్తుండటం వలన, అందరికీ రీచ్ కాలేకపోతోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.