Natty Subramaniam: ర్యాష్ డ్రైవింగ్ చేశారా అంతే .. ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్ !

- 2023లో విడుదలైన సినిమా
- సైకాలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- ప్రధానమైన పాత్రను పోషించిన నట్టి సుబ్రమణియన్
- రేపటి నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్
సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో కోలీవుడ్ నుంచి ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'వెబ్'. మునివేలన్ నిర్మించిన ఈ సినిమాకి 'హరూన్' దర్శకత్వం వహించాడు. 2023 ఆగస్టు 4 వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చారు. అలాంటి ఈ సినిమా, ఏడాదిన్నర తరువాత ఓటీటీకి వస్తోంది.
రేపటి నుంచి ఈ సినిమా 'ఆహా' తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో నట్టి సుబ్రమణియన్ .. శిల్పా మంజునాథ్ .. రాజేంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ అంతా కూడా ఈ పాత్రల చుట్టూనే తిరగనుంది. నట్టి సుబ్రమణియన్ నటన ఈ సినిమాకి హైలైట్ అనే టాక్ ఆ సమయంలో బాగా వినిపించింది. ఈ సినిమాకి, కార్తీక్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు.
కథలోకి వెళితే .. ఓ అయిదుగురు అమ్మాయిలు రేవ్ పార్టీలో ఫుల్లుగా తాగేసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళుతూ ఉంటే, ఓ కిల్లర్ వాళ్లను కిడ్నాప్ చేస్తాడు. ఓ పాడుబడిన బంగళాలో వాళ్లను బంధిస్తాడు. వాళ్లలో ఒకరిని అతను చంపిన తీరు చూసి మిగతావాళ్లు వణికిపోతారు. ర్యాష్ డ్రైవింగ్ చేసినవారిని అతను అలాగే చంపుతాడని తెలిసి కొయ్యబారిపోతారు. ర్యాష్ డ్రైవింగ్ కీ .. అతను అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆ నలుగురు అమ్మాయిలు అతని బారి నుంచి బయటపడగలుగుతారా? అనేది కథ.