Kimbal Musk: తెరపైకి మస్క్ సోదరుడు... ట్రంప్ సుంకాలను తప్పుబట్టిన కింబాల్ మస్క్

Kimbal Musk Criticizes Trumps Tariffs

  • ఇటీవల టారిఫ్ లు పెంచిన ట్రంప్
  • అమెరికాకు గొప్ప సామర్థ్యాలు ఉన్నాయన్న కింబాల్
  • బలహీనతలను బలవంతంగా రుద్దకూడదని హితవు

ప్రముఖ పారిశ్రామికవేత్త కింబల్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ యొక్క సుంకాల విధానాలను విమర్శిస్తూ వార్తల్లో నిలిచారు. కింబాల్ మస్క్ ఎవరో కాదు... ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడు ఎలాన్ మస్క్ సోదరుడే. ట్రంప్ నూతన టారిఫ్ విధానాలు అమెరికన్ వినియోగదారులపై శాశ్వత పన్నులాంటివని కింబాల్ మస్క్ అభివర్ణించారు. సుంకాలను పెంచడం ద్వారా అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని, ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికాకు గొప్ప సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని, బలహీనతలను బలవంతంగా రుద్దకూడదని ట్రంప్ కు హితవు పలికారు.

కింబల్ మస్క్ ఎవరు?

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 1972 సెప్టెంబరు 29న కింబాల్ మస్క్ జన్మించారు. కింబాల్ మస్క్ దక్షిణాఫ్రికా-కెనడియన్-అమెరికన్ వ్యాపారవేత్త, దాత, రెస్టారెంట్ యజమాని. ఎలాన్ మస్క్, టోస్కా మస్క్‌లకు కింబాల్ మస్క్ తోబుట్టువు. 1995లో కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో బిజినెస్‌లో డిగ్రీని పూర్తి చేశారు. 2014 నుంచి తాను ధరించే సిగ్నేచర్ కౌబాయ్ టోపీతో కింబాల్ బాగా ప్రసిద్ధి చెందారు. పర్యావరణ కార్యకర్త క్రిస్టియానా వైలీని వివాహం చేసుకున్న కింబాల్, ప్రస్తుతం కొలరాడోలోని బౌల్డర్‌లో నివసిస్తున్నారు.

వ్యాపార ప్రస్థానం

1995లో కింబాల్ తన సోదరుడు ఎలాన్‌ మస్క్ తో కలిసి జిప్2ను స్థాపించారు. ఇది వార్తాపత్రికల కోసం బిజినెస్ డైరెక్టరీలు, మ్యాప్‌లను అందించే సాఫ్ట్‌వేర్ సంస్థ. 1999లో కాంపాక్ ఈ సంస్థను కొనుగోలు చేసింది. ఆ తర్వాత కింబాల్ ఆహార రంగంపై దృష్టి సారించారు. బౌల్డర్, డెన్వర్, చికాగో, ఆస్టిన్ వంటి నగరాల్లో కమ్యూనిటీ-ఆధారిత, ఫార్మ్-టు-టేబుల్ రెస్టారెంట్లను స్థాపించారు. 2016లో ఆయన స్క్వేర్ రూట్స్ అనే అర్బన్ ఫార్మింగ్ కంపెనీని స్థాపించారు. ఇది హైడ్రోపోనిక్, ఇండోర్, వాతావరణ-నియంత్రిత షిప్పింగ్ కంటైనర్‌లను ఉపయోగించి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది.

టెస్లా, స్పేస్‌ఎక్స్, చిపోటిల్‌లో కింబాల్ పాత్ర

కింబాల్ అనేక ప్రముఖ కంపెనీల బోర్డులలో కూడా పనిచేశారు. వాటిలో టెస్లా, స్పేస్‌ఎక్స్, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ ముఖ్యమైనవి. ఆహారం, విద్యా రంగాలలో తాను చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం బిగ్ గ్రీన్ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అమెరికాలోని పాఠశాలల్లో వందలాది అవుట్‌డోర్ తరగతి గదులను నిర్మించింది. వీటిని లెర్నింగ్ గార్డెన్స్ అని పిలుస్తారు.

ఎలాన్ మస్క్‌తో విభేదాలు

వృత్తిపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ, కింబాల్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయి. జిప్2 రోజుల్లో వారి మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయని, కొన్నిసార్లు అది శారీరక ఘర్షణలకు కూడా దారితీసిందని సమాచారం. కింబల్ 2024 జూలైలో టైమ్స్‌తో మాట్లాడుతూ... తాను, ఎలాన్ మస్క్ చిన్నతనంలో అక్షరాలా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకునేవాళ్లమని, ఆ తరువాత వెంటనే రాజీపడేవాళ్లమని చెప్పారు. "మేము ఒక క్షణంలో ఎంత కోపంగా ఉన్నా, ఐదు నిమిషాల తర్వాత కలిసి సినిమా చూడాలనుకుంటాము" అని వెల్లడించారు. 

అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, వారి సోదర బంధం మాత్రం బలంగానే ఉంది. 2020 మేలో స్పేస్‌ఎక్స్ ఇద్దరు నాసా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన తర్వాత కింబాల్ తన సోదరుడు ఎలాన్‌ను ప్రశంసించారు. ఆ తరువాత తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "ఈ రోజు చరిత్ర సృష్టించబడింది. ఇది చాలా గొప్ప రోజు. @SpaceX, @nasa మరియు ముఖ్యంగా నా సోదరుడు, ప్రతి ఒక్కరి గురించి నేను గర్వపడుతున్నాను" అని ఆయన రాశారు.
 
టోస్కా ఏమంటున్నారంటే...

తోబుట్టువులుగా తాము చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నామని, వేర్వేరు నగరాల్లో నివసిస్తున్నప్పటికీ తమ బంధాన్ని కొనసాగిస్తున్నామని టోస్కా చెప్పారు. "వారు నాతో ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మేము చాలా లక్షణాలను పంచుకుంటామని నేను అనుకుంటున్నాను. మేము కచ్చితంగా ఒకరి సహవాసాన్ని ఆనందిస్తాము. వీలైనంత తరచుగా ఒకరినొకరు చూసుకోవడానికి ప్రయత్నిస్తాం" అని ఆమె సండే టైమ్స్‌తో అన్నారు. "కింబాల్ ఒక చెఫ్ కాబట్టి అతను బాగా వండుతాడు. సాధారణంగా మేము టేబుల్ చుట్టూ కూర్చుని నవ్వుతూ హాయిగా ఆస్వాదిస్తాం "అని చెప్పారు.

Kimbal Musk
Elon Musk
Donald Trump
Tariffs
Tesla
SpaceX
Zip2
Businessman
Entrepreneur
Philanthropist
  • Loading...

More Telugu News