Jitan Ram Manjhi: భర్త చేతిలో హత్యకు గురైన కేంద్రమంత్రి మనవరాలు

- గయ జిల్లా టెటువా గ్రామంలో విషాదం
- హత్యకు దారి తీసిన భార్యాభర్తల మధ్య ఘర్షణ
- భర్త రమేశ్‌ను ఉరి తీయాలని డిమాండ్
కేంద్ర మంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మాదేవి భర్త చేతిలో హత్యకు గురయ్యారు. ఆమె వయసు 32 సంవత్సరాలు. బీహార్‌లోని గయ జిల్లా టెటువా గ్రామంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. సుష్మాదేవి తన పిల్లలు, సోదరి పూనమ్ కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసి ఉంటుందని అనుమానిస్తున్నారు.
సంఘటన గురించి సుష్మాదేవి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ, మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుష్మాదేవి భర్త రమేశ్ పని నుంచి ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. గొడవ తీవ్రం కావడంతో రమేశ్ నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడని తెలిపారు. గొడవ, కాల్పుల శబ్దం విన్న తాను, పిల్లలు పరుగెత్తుకుంటూ అక్కడకి వెళ్లేసరికి సుష్మాదేవి రక్తపు మడుగులో పడి ఉందని అన్నారు. తన సోదరిని చంపిన రమేశ్‌ను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని పూనమ్ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గయ ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం, టెక్నికల్ నిపుణులను ఆధారాల సేకరణ కోసం ఘటనా స్థలానికి పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.