Lokesh: టీడీపీ పగ్గాలు లోకేశ్ కి అప్పగించాలి: ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు

- మరోసారి వర్మ వ్యాఖ్యల కలకలం
- కాకినాడ జిల్లా టీడీపీ ఆఫీసులో ప్రజాదర్బార్
- లోకేశ్ యువగళం పాదయాత్ర పార్టీ విజయానికి దోహదం చేసిందని వెల్లడి
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇటీవల వ్యాఖ్యానించి కలకలం రేపిన వర్మ... తాజాగా లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని అన్నారు.
కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన మాట్లాడుతూ... పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని, లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అన్నారు.
అంతేకాకుండా పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తలు సంపూర్ణ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
మంత్రి నారా లోకేశ్ చాలాకాలంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ చీఫ్ గా ఉన్నారు.