Rajeev Kanakala: ఆస్తుల విషయంలో అదంతా పుకారే: రాజీవ్ కనకాల

- ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాము
- నాన్న సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు
- కష్టపడి అప్పులు తీర్చుతూ వచ్చాము
- విడాకుల పుకారు అలా మొదలైందన్న రాజీవ్ కనకాల
నటుడిగా, నిర్మాతగా రాజీవ్ కనకాల కొన్ని ప్రాజెక్టులు చేస్తూ వెళుతున్నాడు. రీసెంటుగా ఆయన చేసిన 'హోమ్ టౌన్' సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆయన 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. "1988లో అనుకుంటాను... మా ఫాదర్ 40 లక్షలను వడ్డీకి తెచ్చి మరీ ఒక ప్రాపర్టీ కొన్నారు. ఆ విషయంలో అవతలవారు ఆయనను మోసం చేశారు. ఫలితంగా అప్పులు, వడ్డీలు మాత్రమే మిగిలాయి" అని అన్నాడు.
"ఆ రోజులలోనే నెలకి 30 వేల నుంచి 40 వేలు వడ్డీలు కట్టవలసి వచ్చేది. ఈ కారణంగా ఇంట్లో గొడవలు అవుతూ ఉండేవి. ఆ సమయంలో నాన్నగారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఆ విషయం అమ్మ చెబితే... మా నాన్నకు నేనే ధైర్యం చెప్పాను. ఎనో కష్టాలు పడుతూ ఆ అప్పు తీర్చాము. ఇక నేను, సుమ విడాకులు తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వలన నేను మా నాన్నతో కలిసి పాత ఇంట్లో ఉన్నాను. ఆ సమయంలో ఇలాంటి పుకార్లు సృష్టించారు" అని చెప్పాడు.
"ఇక మీరంతా అనుకుంటున్న స్థాయిలో మాకు ఆస్తులు లేవు... ఉన్నది ఒకటే ఇల్లు. కొంతమంది తమ వెంచర్లో ప్లాట్లు అమ్ముకోవడం కోసం, సుమ-రాజీవ్ కనకాల వాళ్లు తీసుకున్నారని కస్టమర్లతో చెబుతున్నారట. దాంతో మాకు చాలా చోట్ల ల్యాండ్స్ ఉన్నాయని అనుకుంటున్నారు. నిజానికి అదంతా ప్రచారం మాత్రమే" అని స్పష్టం చేశాడు.