Donald Trump: చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. ప్రపంచ మార్కెట్లు ఢమాల్!

- నేటి నుంచి అమల్లోకి రానున్న అధిక టారిఫ్‌లు
- ట్రంప్ ప్రకటనతో కుదేలైన ప్రపంచ మార్కెట్లు
- నేడు భారత్ మార్కెట్లపైనా ఒత్తిడి పడే అవకాశం
ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు గట్టి షాకిచ్చారు. ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఏకంగా 104 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దెబ్బతో ప్రపంచ మార్కెట్లు మరోమారు కుదేలయ్యాయి. అమెరికా మార్కెట్లు ఇప్పటికే నష్టాలను చవిచూశాయి. నిన్న ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు తొలుత లాభాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే, ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ ప్రారంభంలో 4.1 శాతానికిపైగా లాభంతో ట్రేడ్ అయింది. చివరికి 1.6 శాతం పతనమైంది. ఫిబ్రవరిలో నమోదైన రికార్డు నుంచి ఈ సూచీ ఇప్పటి వరకు 19 శాతం దిగజారింది. మరోవైపు, డౌజోన్స్ కూడా నిన్న 0.8 శాతం, నాస్‌డాక్ 2.1 శాతం మేర కుంగిపోయాయి.
ఇక, ఈ ఉదయం జపాన్ నిక్కీ 4 శాతానికి పైగా నష్టాలు చవిచూసింది. దక్షిణ కొరియా కోస్పి ఒక శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 2 శాతం మేర దిగజారాయి. అలాగే, న్యూజిలాండ్, హాంకాంగ్, చైనా సూచీలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నేడు భారత మార్కెట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. చైనాపై అమెరికా విధించిన 104 శాతం టారిఫ్ నేటి నుంచి అమల్లోకి రానుంది. మిగతా దేశాలపై విధించిన అధిక టారిఫ్‌లు కూడా నేటి నుంచి పూర్తిగా అమల్లోకి రానున్నాయి.