Kedar Jadhav: బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్

- ముంబైలోని నారీమన్ పాయింట్ కార్యాలయంలో పార్టీలో చేరిన జాదవ్
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ సీనియర్ నేత
- బీజేపీ అభివృద్ధి రాజకీయాలు చేస్తోందన్న కేదార్ జాదవ్
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ముంబైలోని నారీమన్ పాయింట్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా, ముందుగా ఛత్రపతి శివాజీకి నమస్కరించిన కేదార్ జాదవ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ అభివృద్ధి రాజకీయాలు చేస్తోందని ప్రశంసించారు. మహారాష్ట్రకు తనవంతు సహకారాన్ని అందించేందుకు బీజేపీలో చేరినట్లు తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత చంద్రశేఖర్ బవాన్కులే మాట్లాడుతూ, ఈరోజు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నో రంగాల్లో జాదవ్ తన ప్రతిభను చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ కుటుంబంలోకి ఆయనను సాదరంగా స్వాగతిస్తున్నామని అన్నారు.
