Sathish Vegesna: కథాసుధ: గతంలోకి తీసుకెళ్లే జ్ఞాపకాల 'ఉత్తరం'

- కొత్త కథల సమాహారంగా 'కథాసుధ'
- తొలి ఎపిసోడ్ గా వచ్చిన 'ఉత్తరం'
- గతంలోకి తీసుకెళ్లే ఒక అందమైన జ్ఞాపకం
- సున్నితమైన ఎమోషన్స్ తో ఆకట్టుకున్న కథ
- గ్రామీణ నేపథ్యం ప్రధానమైన ఆకర్షణ
ఈటీవీ విన్ ఇప్పుడు కొత్తగా ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 'కథాసుధ' టైటిల్ క్రింద కొత్త కథలను సింగిల్ ఎపిసోడ్స్ గా అందించడానికి సిద్ధమైంది. అలా నిన్న 'కథాసుధ' నుంచి 'ఉత్తరం' అనే ఎపిసోడ్ ను వదిలారు. గ్రామీణ నేపథ్యంలో .. ఉత్తరాల రోజులలోకి తీసుకెళ్లే కథ ఇది. ఈ ఎపిసోడ్ కి సతీశ్ వేగేశ్న దర్శక నిర్మాతగా .. రచయితగా వ్యవహరించాడు.
కథలోకి వెళితే .. అది ఒక అందమైన పల్లెటూరు. కొత్తగా పెళ్లై ఆ ఊరు నుంచి వెళ్లిన చిన్ని (పూజిత పొన్నాడ), ఆషాఢమాసం కావడంతో పుట్టింటికి వస్తుంది. తరచూ భర్త 'జై' (బాలాదిత్య)కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈ కాలం మెసేజ్ లలో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందనీ, తమ కాలంలోని ఉత్తరాలలో ఎమోషన్స్ ఉండేవని ఆమె నాయనమ్మ తులసి (తులసి) చిన్నితో అంటుంది. ఆ జ్ఞాపకాల చిట్టాను మనవరాలి ముందు విప్పుతుంది. ఆ జ్ఞాపకాలలో దాగిన అనుభూతులు ఎలాంటివి? అనేది కథ.
సతీశ్ వేగేశ్న సరదాగా అల్లుకున్న సింపుల్ కంటెంట్ ఇది. అయినా చక్కని ఫీల్ తో కూడిన దృశ్యాలతో ఆ రోజులలోకి తీసుకుని వెళ్లగలిగాడు. గ్రామీణ నేపథ్యం .. ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన విజువల్స్ ఈ కథను మరింత సహజంగా మనసులకు కనెక్ట్ చేస్తాయి. దాము నర్రావుల ఫొటోగ్రఫీ .. బాలచంద్రన్ సంగీతం ఆకట్టుకుంటాయి. ఆధునీకత పేరుతో అనుభూతికి దూరంగా సాగుతున్న జీవితాలపై అప్పుడప్పుడు ఇలాంటి కథలు చల్లడం అవసరమే.