M A Baby: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబి

- ముధురైలో ముగిసిన సీపీఎం 24వ అఖిల భారత మహాసభలు
- ఎంఏ బేబీ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ప్రకటించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
- ఎంఏ బేబీకి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన మరియం అలెగ్జాండర్ బేబీ (ఎంఏ బేబీ) ఎన్నికయ్యారు. ఈ నెల 2వ తేదీ నుంచి మధురైలో జరుగుతున్న సీపీఎం 24వ అఖిల భారత మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయనను పార్టీ కొత్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
ఎంఏ బేబీ పేరును పార్టీ కోఆర్డినేటర్ ప్రకాశ్ కారత్ ప్రతిపాదించారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నికైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సీతారాం ఏచూరి మరణానంతరం ఆ పదవికి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఆయనకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి కలిగిన ఎంఏ బేబీ.. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐలలో వివిధ పదవుల్లో కొనసాగారు. 1986 నుంచి 98 వరకు సీపీఎం రాజ్యసభ సభ్యుడిగా, 2005 నుంచి 2016 వరకు రెండు విడతలు ఎమ్మెల్యేగా, 2011 నుంచి ఐదేళ్ల పాటు కేరళ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014లో లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.