MS Dhoni: రిటైర్మెంట్ వార్తలపై ధోనీ మాట ఇదే!

Dhoni Denies Retirement Rumors

  • ధోనీ రిటైర్మెంట్ పై కొంతకాలంగా ఊహాగానాలు
  • కొన్నిరోజుల కిందట స్టేడియంకు వచ్చిన ధోనీ తల్లిదండ్రులు
  • ధోనీ రిటైర్మెంట్ పక్కా అంటూ వార్తలు!
  • ఓ పాడ్ కాస్ట్ లో తన మనసులో మాట చెప్పేసిన ధోనీ

క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్! మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలకు స్వయంగా తానే చెక్ పెట్టాడు. తాను ఇప్పుడప్పుడే ఐపీఎల్ నుంచి తప్పుకునే ఆలోచన లేదని ధోనీ తేల్చి చెప్పాడు.

కొంతకాలంగా ధోనీ రిటైర్మెంట్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకీ దేవి ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ చూడటానికి చెపాక్ స్టేడియానికి రావడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. ధోనీ తల్లిదండ్రులు సాధారణంగా మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి రారు. దీంతో ఇదే ధోనీ చివరి సీజన్ కావొచ్చని అందరూ అనుకున్నారు.

అయితే, ధోనీ మాత్రం తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ... "నేను ఇంకా ఆడుతున్నాను. ప్రతి సంవత్సరం నా శరీరం సహకరిస్తుందో లేదో చూసుకుంటాను. నా రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా నా శరీరంపై ఆధారపడి ఉంటుంది. శరీరం సహకరించినంత వరకు ఆడటం కొనసాగిస్తాను" అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ధోనీ వయస్సు 43 ఏళ్లు. ఈ వయసులో కూడా తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ యంగ్ ప్లేయర్స్‌కు పోటీనిస్తున్నాడు ధోనీ.

సీఎస్కే ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచినా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. జట్టు ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 8న చండీగఢ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది.

ధోనీ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇవ్వడంతో సీఎస్కే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతకాలం తమ అభిమాన ఆటగాడిని చూడొచ్చని సంబరపడుతున్నారు.

MS Dhoni
Dhoni Retirement
IPL
Chennai Super Kings
CSK
Dhoni Latest News
Cricket News
Indian Cricket
Dhoni Interview
Podcast
  • Loading...

More Telugu News