SVU Campus: ఎస్వీయూ క్యాంపస్‌లో చిక్కిన చిరుత

- గత కొన్నాళ్లుగా ఎస్వీయూ క్యాంపస్ లో సంచరిస్తున్న చిరుత
- ఇటీవల క్యాంపస్ లో జింక పిల్లపై చిరుత దాడి
- క్యాంపస్ లో పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు పట్టుబడింది. ఎస్వీయూ క్యాంపస్‌లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
చిరుతను అటవీ సిబ్బంది ఎస్వీ జూపార్క్ కు తరలించారు. చిరుత సంచారంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు పలు ప్రాంతాలలో బోన్లను ఏర్పాటు చేశారు. అయితే, బోనులో చిక్కకుండా చిరుత తప్పించుకు తిరుగుతోంది.
ఇటీవల ప్రధాన గ్రంథాలయం వెనుక భాగంలో ఒక జింక పిల్లపై చిరుత దాడి చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో ఉదయం 7 గంటల లోపు, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరూ సంచరించవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిరుత బోనులో చిక్కింది.