Mohan Babu: నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా... సక్సెస్ అయ్యా: మోహన్ బాబు

Mohan Babus Inspiring Journey in Telugu Cinema

  • నటుడిగా తనకు దాసరి తొలి అవకాశం ఇచ్చారన్న మోహన్ బాబు
  • ఆస్తులన్నీ తాకట్టు పెట్టి 'మేజర్ చంద్రకాంత్' తీశానని వెల్లడి
  • ట్రోలింగ్ లను పట్టించుకోనని వ్యాఖ్య

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. తాను చూసిన తొలి సినిమా 'రాజమకుటం' అని తెలిపారు. ఎవరికీ చెప్పకుండా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆ సినిమా చూశానని చెప్పారు. నటుడిగా తనకు దాసరి నారాయణరావు తొలి అవకాశం ఇచ్చారని తెలిపారు. 1975లో 'స్వర్గం నరకం' సినిమా ద్వారా విలన్ గా సినీ పరిశ్రమకు పరిచయమయ్యానని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికీ నటుడిగా తన కెరీర్ కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

తన సొంత బ్యానర్ ను అన్న ఎన్టీఆర్ ప్రారంభించారని మోహన్ బాబు తెలిపారు. నిర్మాతగా తన తొలి సినిమా 'ప్రతిజ్ఞ'కు చంద్రబాబు క్లాప్ కొట్టారని వెల్లడించారు. అదే బ్యానర్ పై 'మేజర్ చంద్రకాంత్' సినిమా తీశానని... తన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి ఆ సినిమాను నిర్మించానని చెప్పారు. వద్దు అని అన్నగారు ఎన్టీఆర్ చెప్పినప్పటికీ, మొండిగా సినిమా తీశానని... సక్సెస్ అయ్యానని తెలిపారు. 

తాను కోరుకున్నవన్నీ జరిగాయని మోహన్ బాబు చెప్పారు. రాజకీయాలు తనకు సెట్ అవ్వవని అన్నారు. దేవుడి దయతో మంచి పాత్రలు వస్తే నటిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 560 సినిమాలు తీశానని చెప్పారు. తనకు ఆవేశం ఎక్కువేనని... అయితే గతాన్ని తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. తనను ఎంతోమంది మోసం చేశారని... అప్పటి నుంచే తనకు ఆవేశం వచ్చిందని చెప్పారు. 

పక్కవారు నాశనం కావాలని ఎప్పుడూ కోరుకోకూడదని అన్నారు. తాను ట్రోలింగ్ లను పట్టించుకోనని చెప్పారు. ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్లకు ఏం ఆనందం వస్తుందో తనకు ఇప్పటికీ అర్థం కాదని అన్నారు. దేవుడి దయవల్లే 'కన్నప్ప' సినిమాలో తనకు అవకాశం వచ్చిందని... దేవుడి ఆశీస్సులతోనే ఈ సినిమా పూర్తయిందని చెప్పారు.

Mohan Babu
Telugu Cinema
Tollywood
NTR
Chandrababu Naidu
Major Chandrakanth
Film Career
Success Story
Film Industry
Telugu Actor
  • Loading...

More Telugu News