Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

- కోర్టు విచారణలో ఉన్న అంశంపై వ్యాఖ్యలు చేయడమేంటని ఫైర్
- బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి సంయమనం అవసరమని హితవు
- ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో జస్టిస్ బీఆర్ గవాయి ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టులో ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి తీవ్రంగా స్పందించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందని, మిగతా రెండు వ్యవస్థల నుంచి అలాంటి గౌరవాన్ని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
స్పీకర్ ను కూడా కోర్టులో నిలబెట్టాం..
స్పీకర్ సర్వస్వతంత్రుడని, ఆయనను కోర్టులు శాసించలేవన్న వాదనపై జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు.