Male Contraceptive Pill: కుటుంబ నియంత్రణలో విప్లవాత్మక ఆవిష్కరణ.. పురుషులకూ గర్భ నిరోధక పిల్‌!

Revolutionary Male Birth Control Pill Developed
  • కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా పరిశోధకులు
  • టెస్టోస్టిరాన్‌ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌
  • వైసీటీ- 529 పేరుతో గర్భ నిరోధక పిల్ అభివృద్ధి 
అగ్ర‌రాజ్యం అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్‌ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను క‌నుగొన్నారు. 

ఇది స్పెర్మ్‌ (వీర్యం) ఉత్పత్తిపై ప్రభావం చూపి గర్భ నిరోధకతగా పని చేస్తుంద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. వైసీటీ- 529 అనే ఈ పిల్‌ను కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటా కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, యూవర్‌ ఛాయిస్‌ థెరప్యూటిక్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 

ఇప్పటికే పురుషులపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయినట్టు పరిశోధకులు తెలిపారు. సేఫ్టీ, ప్రభావవంత పనితీరుకు సంబంధించి రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ త్వరలో జర‌ప‌నున్న‌ట్లు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. కాగా, పురుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించక ముందు మగ ఎలుకలపై వైసీటీ-529 డ్రగ్‌ను ప్రయోగించారు. 

నాలుగు వారాల వ్యవధిలోనే వాటి స్పెర్మ్‌ కౌంట్‌ భారీగా తగ్గింది. అలాగే 99 శాతం ప్రభావవంతంగా పని చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. అంతేగాక ఈ పిల్‌ వాడకాన్ని ఆపేసిన ఆరు వారాల్లోగా ఎలుకలు మళ్లీ ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పొందినట్టు తెలిపారు. 

వైసీటీ-529కు ఆమోదం లభిస్తే కొంతమేర అవాంఛనీయ గర్భధారణను అరికట్టే అవకాశం ఉంది. అలాగే దీని వల్ల మహిళలపై కూడా భారం తగ్గే ఆస్కారం ఉంది.
Male Contraceptive Pill
YCT-529
Columbia University
University of Minnesota
Your Choice Therapeutics
Birth Control Pill for Men
Male Fertility
Testosterone
Clinical Trials
Contraception

More Telugu News