Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై స్పందించిన భార్య

- మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారన్న ప్రవీణ్ అర్ధాంగి జెస్సికా
- ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్దికి వాడుకోవాలని చూడటం దారుణమని వ్యాఖ్య
- పోలీసుల విచారణకు అందరూ సహకరించాలని జెస్సికా వినతి
పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన విషయం విదితమే. ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియా వేదికగా భిన్న కథనాలు వెలువడటం, కొందరు ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేయడంతో రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో బుధవారం పాస్టర్ ప్రవీణ్ కుమార్ అర్ధాంగి జెస్సికా స్పందిస్తూ తన భర్త మరణాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యేసు మార్గాన్ని అనుసరించే వారు మత విద్వేషాలు రెచ్చగొట్టరని ఆమె అన్నారు. తన భర్త ప్రవీణ్ ఎల్లప్పుడూ మత సామరస్యాన్ని కోరుకునేవారని తెలిపారు.
తన భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. తన భర్త మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం దారుణమని ఆమె అన్నారు. పోలీసుల విచారణకు అందరూ సహకరించాలని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.