Nagababu: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు... సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

- ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు ఏకగ్రీవం
- నేడు నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
- సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు
ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇవాళ నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు... నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, జనసేన నేతలు హాజరయ్యారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని... భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని... అంటూ నాగబాబు ప్రమాణం చేశారు.
అనంతరం నాగబాబు సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబు, పద్మజ దంపతులు సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు... నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగబాబుకు శాలువా కప్పి, వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.

